(Local) Thu, 28 May, 2020

కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 4వ అధ్యాయం

November 01, 2019,   9:57 PM IST
Share on:
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 4వ అధ్యాయం

శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తీకమాసం అధికఫలదాయకమైంది.

కార్తీకమాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.

కార్తీక పురాణం ప్రారంభం

కార్తీకపురాణం 4 అధ్యాయం:

శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!
లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!

అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

దీపారాధనా మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మహాతపస్వీ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివితీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడూ అని కోరగా, వశిష్టులవారు ఇట్లు
చెప్పదొడగిరి.
జనకా! కార్తీక మాసమునందు సర్వ సత్కారములు చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలమునొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్ధము శివాలయమున కానీ, విష్ణాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ, ప్రాకారమునందు కానీ
దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠప్రాప్తినొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి వుంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగా అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము.
శతృజిత్కథ
పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను ముని పుంగవుడొచ్చి 'పాంచాల రాజా! నీవు ఎందులకింతటి తపమాచరించుచున్నావు? నీ కోరికయేమి?' అని ప్రశ్నించగా, 'ఋషి పుంగవా! నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు వున్ననూ, నా వంశము నిలుచుటకు పుత్రసంతానము లేక, కృంగి, కృశించి యీ తీర్థ స్థానమున తపమాచరించుచున్నానూ అని చెప్పెను. అంత మునిపుంగవుడు 'ఓయీ! కార్తీక మాసాన శివసన్నిధిన శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన యెడల నీ కోరిక నెరవేర గలదూ అని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తమ దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో కార్తీక మాసము నెలరోజులూ శివాలయమున కార్తీక దీపారాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా,  వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ, విడువకుండా నెలదినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సావం చేయించి, బ్రాహ్మణులకు దానధరమములు జేసి, ఆ బాలునకు 'శతృజిత్తూ అని నామకరణం చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి.
కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శతృజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తి సాము మొదలుగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచూ, ఎదిరించిన వారిని దండించుచూ, తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.
తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని చూసీచూడనట్లు, వినీవిననట్టు ఉండిరి. శతృజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుజెప్పు వారను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేస్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామ వాంఛ తెలియజేసెను. ఆమె కూడా ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయి బట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని బోయి భోగములను అనుబవించెను.
ఇట్లొకరికొకరు ప్రేమపరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచూ తమ కామ వాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.
ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగనమొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా, అని రాజకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురూ మాహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను, ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను.
వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలన, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులనిరువురినీ తీసుకొనిపోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? విచిత్రముగా వున్నదే!' అని ప్రశ్నించేను.
అంత యమకింకరులు 'ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, ఈ పవిత్రదినమున, అనగా, కార్తీక పౌర్ణమి, సోమవారపు దినమున, తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారూ అని చెప్పగా యీ సంభాషణంతయు వినుచున్న రాజ కుమారుడు 'అలా ఎన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపము పోవుటయే గాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాల్గవ అధ్యాయము
నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

సంబంధిత వర్గం
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.