(Local) Fri, 19 Jul, 2019

క్యూకాంప్లెక్స్‌లో తోపులాటల నివారణకు ప్రత్యేక చర్యలు :టిటిడి ఈవో

May 07, 2019,   2:18 PM IST
Share on:

 తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్ల నుండి భక్తులను దర్శనానికి వదిలే సమయంలో తోపులాటల నివారణకు సెక్యూరిటి సిబ్బంది ఏర్పాటుతోపాటు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భద్రత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కంపార్ట్‌మెంట్ల నుండి భక్తులను వదిలే సమయంలో తోపులాట జరుగుతోందని ఫిర్యాదులు అందుతున్నాయని, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా సెక్యూరిటి సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సివిఎస్‌వోను కోరారు. ఎలిఫెంట్‌ గేటు వద్ద ఉన్న బ్రిడ్జి నుండి స్కానింగ్‌ సెంటర్‌ వరకు మూడవ లైన్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సెక్యూరిటీ, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. టిటిడి ఆలయాలు, సంస్థలు, సమాచార కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయం వెలుపలి నుండి వచ్చాక లడ్డూ కౌంటర్‌కు వెళ్లేదారిలో రద్దీ అధికంగా ఉంటోందని, భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న భూగర్భ కేబుల్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచియుండే భక్తుల కోసం టిటిడి డాక్యుమెంటరీలు, పౌరాణిక చిత్రాలను ప్రదర్శించాలని, పిల్లల కోసం యానిమేటెడ్ భ‌క్తి చిత్రాలను రూపొందించాలని ఎస్వీబీసీ సీఈవోకు సూచించారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం పక్కన ఉన్న టిటిడి ఎస్వీ మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలని, గాంధీ రోడ్డు వైపుగల ద్వారాన్ని తెరవాలని, తద్వారా ఎక్కువ మంది భక్తులు సందర్శించే అవకాశం ఉంటుందని ఈవో వివరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎస్వీబీసీ స్టూడియో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం పరిధిలో పార్క్‌ చేస్తున్న అనధికారిక, బయటివ్యక్తుల వాహనాలను తొలగించాలని ఆదేశించారు. కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, మే 5న 16,500 మంది దర్శించుకున్నారని తెలిపారు. అక్కడ మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ బాలాజీ, డిఎల్‌వో శ్రీ రమణ నాయుడు, డిప్యూటీ ఈవో (జనరల్‌) శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.