(Local) Tue, 20 Aug, 2019

గాలిగోపురం గొప్పతనం ..

June 09, 2019,   4:53 PM IST
Share on:

ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోపురం. చాలా ఎత్తుగా, అనేక అంతస్తులతో, అనేక శిల్పాలతో, చూడగానే భక్తుడికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి, మరికాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం. గోపురాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.ఆలయానికి తొలివాకిలి గోపురం. దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది. ద్వారం పైన నిర్మించే నిర్మాణం కనుక ఇది ద్వారశాల. మరికొందరు గాలిగోపురం అని చెబుతుంటారు. గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటిగాలి వీస్తుంది. బహుశా అందువలన అందరూ ఇలా అంటారని భావించవచ్చు. కానీ నిజానికి ఆలయంలోని ప్రతిభాగం భగవంతుని శరీరభాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు. అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి. కాలిగోపురం కాలక్రమేణా గాలిగోపురం అయిపోయింది. మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయగోపురమే.

అలా గోపురం కనిపించిన వెంటనే చాలా మంది నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే.గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల. గోపురంపై అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించింది మాత్రం పాండ్యురాజులే. మధురైలోని మీనాక్షీ ఆలయ గోపురాలే అందుకు నిదర్శనం.హంపీ విరూపాక్ష దేవాలయంలో గోపురానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఆలయంలోని ఒకచోట తూర్పు రాజగోపురం నీడ తల్లకిందులుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో గల నరసింహ స్వామి ఆలయ గాలిగోపురం కూడా ఎత్తయిన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.