(Local) Wed, 23 Oct, 2019

ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ

June 15, 2019,   2:52 PM IST
Share on:
ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ

ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. సుమారు నాలుగు నెలల తర్వాత సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ కానుంది. గతంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ముందు భేటీ జరిగింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికలు రావడంతో సమావేశం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న జరిగే ఈ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నూతన పురపాలక చట్టం తీసుకురావాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూశాఖలోని కొన్ని సంస్కరణలకు సూచనలు చేసిన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కొత్త పురపాలక చట్టం ఆమోదం కోసం అవసరమైతే అసెంబ్లీని సమావేశపరిచే అంశంపైనా చర్చించే వీలుంది. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆ అంశంపైనా కీలకంగా చర్చించనున్నారు. ఇటీవల ఆసరా పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని పెంచడంతో పాటు రైతుబంధు నిధుల పెంపు అంశంపైనా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. వాటికి విధివిధానాలు ఇంకా ప్రకటించలేదు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన భవనాలను తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం దిశగా ముందుకెళ్తోంది. ఈ అంశాలపైనా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.