(Local) Sun, 31 May, 2020

రివ్యూ : చిత్రలహరి

April 12, 2019,   2:57 PM IST
Share on:
రివ్యూ : చిత్రలహరి

కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని తన పేరును కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు.

కథ :  జీవితంలో సక్సెస్ అనేది లేకుండా ఫెయిల్యూర్స్‌తోనే కాలం గడుపుతున్న విజయ్ కృష్ణ(సాయి తేజ్) ఇంజనీరింగ్ చేసి ఓ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తుంటాడు.అలాంటి విజయ్ జీవితంలోకి లహరి(కళ్యాణి ప్రియదర్శన్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో స్వేచ్ఛ(నివేదా పేతురాజ్) వీళ్లిద్దరి జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత విజయ్ ప్రేమను కాదని లహరి వెళ్లిపోతుంది. అప్పట్నుంచి తన ప్రేమను గెలిపించుకోడానికే కాకుండా కెరీర్‌లో గెలవడానికి కూడా ప్రయత్నిస్తుంటాడు విజయ్. మరి ఆ ప్రయత్నంలో విజయం ఎలా సాధించాడనేది కథ..

ప్లస్ పాయింట్స్: ఎప్పటినుండో హిట్ కోసం చూస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా లో విజయ్ పాత్రలో పరిణితితో కూడిన నటనను ప్రదర్శించాడు. గత చిత్రాలకు పూర్తిభిన్నంగా సెటిల్డ్ పర్ కనబరిచాడు. సంఘర్షణతో కూడిన స్ఫూర్తివంతమైన పాత్రలో మెప్పించాడు.ఇంకా హీరోయిన్స్ కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ తమ పరిధుల మేరకు నటించారు. ఇద్దరి స్క్రీన్  ప్రెజన్స్ చాలా అక్కటుకుంది ఇక తేజ్ కి తండ్రిగా నటించిన పోసానికి తేజ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. కమెడియన్స్ వెన్నెల కిషోర్, సునీల్, హైపర్ ఆది తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. 

మైనస్ పాయింట్స్ : ఈ చిత్రం లో దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికి ఆ లైన్ ను పూర్తి స్థాయిలో బలంగా,ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమా మొదటి భాగంలో కథా కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్‌ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది.అలాగే జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ చూడని హీరో, .. మొదటి సారి సక్సెస్ అయ్యే సీక్వెన్స్ ను దర్శకుడు, సరైన ముగింపు ఇస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం :దర్శకుడు కిషోర్ తిరుమల కథను నడిపిన విధానం బాగుంది.  దర్శకుడిగా కంటే రచయితగా కిషోర్ ప్రతిభను కనబరిచాడు.  దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటల్లో గ్లాస్ మెట్ సాంగ్ తో పాటు మరో రెండు పాటలు బాగా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు : ఈ వేసవి సెలవులు సినిమాకు అడ్వాంటేజ్ కానున్నాయి. వినోదానికి లోటు లేకపోవడంతో సమ్మర్ రేసులో ఈ సినిమా విజేతగా నిలిచే అవకాశం ఉంది.చిత్రలహరి.. ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్..

రేటింగ్ :3 / 5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.