(Local) Thu, 02 Jul, 2020

రివ్యూ : ఎఫ్ 2 – సింపుల్ అండ్ ఫన్నీ

January 12, 2019,   1:33 PM IST
Share on:
రివ్యూ : ఎఫ్ 2 – సింపుల్ అండ్ ఫన్నీ

సంక్రాంతి సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

క‌థ:ఎమ్మెల్యే ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌గా ఉండే వెంకీ(వెంక‌టేష్‌)కు హారిక‌(త‌మ‌న్నా)తో పెద్ద‌లు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేస్తారు. అలాగే బోర‌బండ‌కు చెందిన వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌)కు హారిక చెల్లెలు హ‌నీ(మెహ‌రీన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. పెళ్లి త‌ర్వాత హారిక‌, ఆమె త‌ల్లి చేసే ప‌నుల వ‌ల్ల వెంకీకి ఫ్ర‌స్టేష‌న్ పెరిగిపోతుంటుంది. వ‌రుణ్‌ను క‌లిసిన త‌ర్వాత వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇస్తాడు. కానీ వెంకీ మాట‌ల‌ను వ‌రుణ్ ప‌ట్టించుకోడు. ఇంటి ప‌క్క‌నుండే వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) స‌ల‌హాతో ముగ్గురు క‌లిసి యూర‌ప్ ట్రిప్‌కి వెళ‌తారు. విష‌యం తెలుసుకున్న హారిక‌, హానీ కూడా యూరప్‌కి బ‌య‌లుదేరుతారు. అంద‌రూ ప్ర‌కాష్ రాజ్ ఇంట్లో చేరుతారు. అక్క‌డ నుండి ఫ‌న్నీగా సినిమా సాగిపోతుంది. అస‌లు అంద‌రూ ప్ర‌కాశ్ రాజ్ ఇంటికి ఎందుకు వెళ‌తారు. పెళ్లి అనే బంధం నుండి వెంకీ, వ‌రుణ్‌లు బ‌య‌ప‌డ్డారా? భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధాన్ని వారు గుర్తించారా? .. విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్ పాయింట్స్ : నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని తన కామెడీని గుర్తుకు తెస్తారు. ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్ తేజ్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ లో కూడా తనలోని కామెడీ యాంగిల్ తో మరియు తన మాడ్యులేషన్ తో వెంకీ బాగా అలరిస్తారు.

మొదటి నుంచి వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ వస్తోన్న వరుణ్ తేజ్ మొట్ట మొదటి సారిగా ఒక కామెడీ సినిమాలో నటించారు. అయితే వెంకటేష్ కామెడీ టైమింగ్ ముందు వరుణ్ లోని కామెడీ యాంగిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ఉన్నంతలో వరుణ్ బాగానే నవ్విస్తాడు. ఇక భర్తను ఇబ్బందులకు ఫ్రస్ట్రేషన్ కి గురి చేసే పెత్తనం గల భార్యగా నటించిన తమన్నా, అదేవిధంగా సేమ్ తమన్నా లాంటి బిహేవియరే కలిగిన మెహరీన్ తమ నటనతో పాటు తమ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. తమన్నా ఎప్పటిలాగే బాగా చేయగా.. పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేదు అని పేరు ఉన్న మెహరీన్ కూడా ఈ సినిమాలో తన తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తోంది.

ఆలగే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఒకప్పటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో నవ్విస్తారు. ముఖ్యంగా హరితేజకు ఆయనకు మధ్య వచ్చే హాస్య సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తోంది. సీనియర్ నటులు నాజర్, ప్రకాష్ రాజ్, అలాగే ప్రకాష్ రాజ్ కొడుకులుగా నటించిన సుబ్బరాజు మరియు సత్యం రాజేష్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేయగా.. వారి నుండి కూడా అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని రాబట్టుకున్నాడు.కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘పటాస్’ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ తో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :ఫస్టాఫ్ లో బాగా నవ్వించినా.. సినిమాలో ఫస్టాఫ్ ముగిసే వరకు కథ పై ప్రేక్షకునికి ఒక క్లారిటీ అంటూ రాకపోవడం, సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ గా అనిపించడం, కథకే ప్లాట్ పాయింట్ లాంటి ప్రకాష్ రాజ్ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గిస్తాయి. 

సాంకేతిక విభాగం :ఈ మధ్య పేలవ ఫాంలో కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎఫ్-2’లోనూ మెప్పించలేకపోయాడు. సంగీతానికి పెద్దగా ప్రాధాన్యమున్న సినిమా కాకపోవచ్చు కానీ.. పాటల్లో ఒక్కటి కూడా ప్రత్యేకంగా అనిపించదు. మళ్లీ వినాలనిపించేలా లేదు. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా సాగిపోతుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువలు ఓకే. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఈ తరంలో క్లాస్-మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించేలా కామెడీ పండించడంలో తాను ముందుంటానని అతను మరోసారి చాటి చెప్పాడు.

తీర్పు :మొత్తం మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామెడీని మాత్రమే ఇష్టపడే వాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

రేటింగ్ : 3.25/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.