(Local) Tue, 17 Sep, 2019

రివ్యూ : “మల్లేశం”

June 21, 2019,   9:59 AM IST
Views: 219
Share on:
రివ్యూ : “మల్లేశం”

ఇప్పటి వరకు కమెడియన్ గా మెప్పించిన ప్రియదర్శి చేనేత రంగంలో కృషి చేసిన  చింత‌కింది మ‌ల్లేశం  పాత్రలో నటించిన చిత్రం మల్లేశం  . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :చింతకింద మల్లేశం తల్లిదండ్రులు (చక్రపాణి, ఝాన్సీ) ఎన్నో సమస్యల మధ్య చేనేత పని చేస్తూ బ్రతుకుతుంటారు. ఈ నేపథ్యంలోనే వారికి అప్పుల బాధ ఎక్కువ కావడంతో మల్లేశంకు 6వ తరగతిలోనే చదువు మాన్పించి, చేనేత పని నేర్పిస్తాడు తండ్రి. ఆ విధంగా తండ్రికి మల్లేశం సహాయం చేస్తుండగా… ఆసును అమరుస్తూ భర్త, కొడుకుకు సహాయం చేస్తుంది మల్లేశం తల్లి. ఈ క్రమంలో ఆమె చేతి ఎముక విరిగి బాధపడుతుంది. ఆమె బాధను చుసిన మల్లేశం ఆశు యంత్రాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడూ ఆసు యంత్రాన్ని తయారు చేసే ధ్యాసలోనే ఉండే మల్లేశంను చూసి స్నేహితులు, ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అంతేకాదు మల్లేశంకు పెళ్ళి చేసేయమని అతని తల్లిదండ్రులకు సలహా ఇస్తారు. దీంతో వారు మల్లేశం ఎంతగానో ఇష్టపడే మేనమామ కూతురు పద్మ (అనన్య)తో వివాహం జరిపిస్తారు. భర్త ఆలోచన తెలుసుకున్న పద్మ… మల్లేశంకు తనవంతు ప్రోత్సాహం అందిస్తుంది. అయితే ఓ సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో మల్లేశం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తరువాత భార్యతో కలిసి పట్నం దారి పడతాడు. అతనికి పట్నంలో ఎదురైన పరిస్థితులేంటి ? మరి మల్లేశం ఆసు యంత్రాన్ని ఎలా కనుగొన్నాడు ? అనే విషయం తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి ఒదిగిపోయాడు. తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించ‌డం, ఆసు యంత్రాన్ని కనుగొన‌డంలో ప‌డే తాప‌త్ర‌యం లాంటి అన్ని భావాలతో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ల్లేశం భార్య ప‌ద్మ పాత్ర‌లో నటించిన అన‌న్యకు ఇదే మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చ‌క్క‌టి నటన కనబరిచింది. ఇక తండ్రి పాత్ర‌లో న‌టించిన చ‌క్ర‌పాణి, త‌ల్లి పాత్ర‌లో న‌టించిన ఝాన్సీ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. మిగిలిన పాత్ర‌ధారులు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :తెలంగాణ ప‌ల్లె పాట‌ల‌ను,మంచి నేప‌థ్య సంగీతాన్ని అందించాడు మార్క్ కె.రాబిన్‌.కౌండిల్యస కెమెరా ప‌నితం చాలా బావుంది. పెద్దింటి అశోక్ కుమార్ డైలాగ్స్ చాలా బావున్నాయి.దర్శకుడు రాజ్‌.ఆర్‌. ఈ సినిమాను సరైన నటీనటులను ఎంచుకోవడంతోనే స‌క్సెస్  సాధించాడు. మంచి ఎమోష‌న్స్‌తో చెప్పాల‌నుకున్న క‌థ‌ను చెబితే చాలు కమర్షియల్ హంగులు అక్కర్లేదని ఈ సినిమాతో నిరూపించాడు దర్శకుడు.  నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు : సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ హంగులు అవ‌స‌రం లేదు. మంచి ఎమోష‌న్స్‌తో చెప్పాల‌నుకున్న క‌థ‌ను చెబితే చాలు. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతార‌నుకునే దానికి `మ‌ల్లేశం` చిత్ర‌మొక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

రేటింగ్ :  3 / 5

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.