(Local) Fri, 24 Jan, 2020

పట్టుదలగా రోహిత్ సేన - ఆత్మవిశ్వాసంతో బాంగ్లాదేశ్

November 07, 2019,   4:10 PM IST
Share on:
పట్టుదలగా రోహిత్ సేన - ఆత్మవిశ్వాసంతో బాంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాజ్‌కోట్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. తొలి పోరు పరిస్థితి పునరావృతం కానివ్వరాదని పట్టుదలతో ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు మహా తుపాను రూపంలో వరుణుడి ముప్పు పొంచి ఉంది.

తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. ఇప్పుడు గెలిచి నిలవాల్సిన పరిస్థితిలో అతను కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. శిఖర్ ధవన్ మోస్తరుగా ఆడినా.. అతడి స్ట్రయిక్ రేట్‌పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమయిన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరి కెప్టెన్ ఎవరికీ ఓటేస్తాడో చూడాలి.తొలి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఉసూరుమనిపించగా.. రిషబ్ పంత్ తడబడ్డాడు. అందరూ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. లోయర్‌ మిడిలార్డర్‌లో కృనాల్‌ పాండ్యా కూడా సరైన ఇన్నింగ్స్‌ ఆడితే పరుగుల ప్రవాహం పెరుగుతుంది.

పసలేని బౌలింగ్‌ కూడా భారత్‌ను ముంచింది. పేసర్ దీపక్ చాహర్ రాణిస్తున్నా.. ఖలీల్‌ అహ్మద్‌ నాలుగు ఓవర్లలో ఏకంగా 37 రన్స్‌ సమర్పించాడు. దీంతో అతడికి బదులు శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌ పాండ్యా, యజ్వేంద్ర చాహల్‌ పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. 0-1తో సిరీస్ వెనుకంజలో నిలిచిన నేపథ్యంలో బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సత్తా చాటితేనే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంటుంది.

భారత పర్యటనకు ముందు ఆటగాళ్ల సమ్మె, షకీబల్‌పై నిషేధంతో బంగ్లాదేశ్‌ డీలా పడింది. సీనియర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ టూర్‌ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌ విభాగం బలహీనపడింది. అయితే వాటిని దరిచేరనీయని బంగ్లా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించి ఔరా అనిపించారు. ముఖ్యంగా ఛేదనలో ముష్ఫికర్‌ రహీమ్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో జట్టులో స్ఫూర్తి నింపాడు. ఢిల్లీలో అదరగొట్టిన బౌలర్లు అమినుల్‌ ఇస్లామ్‌, షైఫుల్‌ ఇస్లామ్‌ రాజ్‌కోట్‌లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్‌తో సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని బంగ్లాదేశ్‌ భావిస్తోంది.

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధవన్‌, సంజు శాంసన్‌/కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, క్రునాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌/ఖలీల్‌ అహ్మద్‌.

బంగ్లాదేశ్‌: మహ్మదుల్లా (కెప్టెన్‌), లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీమ్‌/మహ్మద్‌ మిథున్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ (వికెట్‌కీపర్‌), మొసాదెక్‌ హొస్సేన్‌, అఫీఫ్‌ హొస్సేన్‌, అమినుల్‌ ఇస్లామ్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అల్‌ అమిన్‌ హొస్సేన్‌/అరాఫత్‌ సన్నీ, సైఫుల్‌ ఇస్లామ్‌.

పిచ్, వాతావరణం:మహా తుపాను కారణంగా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సాయంత్రం కల్లా తుపాను బలహీన పడుతుందని, మ్యాచ్ సమయానికి భారీ వర్షం పడకపొవచ్చని భారత వాతావరణ శాఖ అంటోంది. గతంలో ఇక్కడ జరిగిన రెండు టి20ల్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈసారి కూడా పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి మళ్లీ పరుగుల ప్రవాహం చూసే వీలుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.