(Local) Mon, 17 Jun, 2019

 ప్రపంచకప్‌ : ఆస్ట్రేలియా X పాకిస్తాన్

June 12, 2019,   1:49 PM IST
Share on:

 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాకిస్థాన్ కీలకమైన పాయింట్‌ను కోల్పోక తప్పలేదు. ఆ మ్యాచ్ జరిగి ఉంటే పాకిస్థాన్‌కే విజయవకాశాలు అధికంగా ఉండేవి. అయితే మ్యాచ్ వర్షార్పణం కావడంతో పాక్ ఒక పాయింట్‌తోనే సంతృప్తి పడక తప్పలేదు. ఇక, బలమైన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు సవాలుగా మారింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాను ఎదుర్కొవడం పాక్‌ను అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఒకదాంట్లో ఓడిపోయింది. భారత్ చేతిలో ఓడినా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. వార్నర్ ఫామ్‌లోకి రావడంతో ఆస్ట్రేలియా మరింత బలోపేతంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా వార్నర్ జట్టుకు కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లో వార్నర్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ అరోన్ ఫించ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఇక, స్మిత్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నిలకడగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగ్గా ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. మాక్స్‌వెల్ కూడా సత్తా చాటాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారె కూడా దూకుడు మీద ఉన్నాడు. భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. స్టొయినిస్, ఉస్మాన్ ఖ్వాజాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక, కౌల్టర్ నైల్ రూపంలో మరో ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. విండీస్‌పై నైల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. కమిన్స్, స్టార్క్, జంపాలతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సైతం పలు మార్పులతో బరిలోకి దిగనుంది. పాక్ పేసర్‌ హసన్‌ అలీ స్థానంలో ఇమాద్‌ను ఆడించాలని పాక్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. మరోవైపు వహాబ్‌ రియాజ్, షాహిన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.టాంటన్‌లో బుధ వారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మ్యాచ్‌ ఎలా సాగుతుందో చూడాలి. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఆకాశం మేఘావృతమై.. వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, క్యారీ(వికెట్ కీపర్), నైల్, రిచర్డ్‌సన్, కమిన్స్, స్టార్క్, జంపా

పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్, హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, అసిఫ్ అలీ, మాలిక్, వాహబ్ రియాజ్, హసన్ అలీ, షాదబ్ ఖాన్, ఆమీర్

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.