(Local) Fri, 23 Aug, 2019

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం

July 17, 2019,   9:21 PM IST
Share on:

కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం లభించింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ పున:సమీక్షించే వరకు మరణశిక్షణను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.ఐసీజేలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చారు. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

2016లో పాకిస్థాన్‌ భద్రతా దళాలకు చిక్కిన 49 ఏళ్ల కుల్‌భూషణ్‌... గూఢచౌర్యానికి, ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ ఆ దేశ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే ఏడాది మే 8న ఐసీజేను ఆశ్రయించింది. ఆయన ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అక్రమంగా నిర్బంధించారంది. న్యాయమూర్తి అబ్దుల్‌ఖవి అహ్మద్‌ యూసుఫ్‌ నేతృత్వంలోని పది మంది సభ్యుల ధర్మాసనం... తాము తుది తీర్పు ఇచ్చేవరకూ మరణశిక్ష అమలును నిలిపివేయాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టి, ఉభయ దేశాల వాదనలను వింది. తాజాగా మళ్లీ విచారణ చేపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్‌ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.  భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.