(Local) Sat, 24 Aug, 2019

అక్రమ వలస దారులను చట్ట ప్రకారం పంపిస్తాం - అమిత్ షా

July 18, 2019,   2:37 PM IST
Share on:

దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి వారిని అంతర్జాతీయ చట్టం ప్రకారం వెనక్కు పంపించడం జరుగుతోందని  కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా రాజ్యసభలో బుధవారం వెల్లడించారు. సమాజ్‌వాది పార్టీ సభ్యుడు జావేద్ అలిఖాన్ పౌరుల జాతీయ జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అసోంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందా ? అని అడిగిన అనుబంధ ప్రశ్నకు పై  విధంగా మంత్రి సమాధానం ఇచ్చారు. సుప్రీం కోర్టు కఠిన పర్యవేక్షణపై అసోంలో ఎన్‌ఆర్‌సి జాబితా తాజాగా సిద్ధమవుతోందని, తుది జాబితా ప్రకటనకు జులై 31వరకు గడువు నిర్ణయించడమైందని చెప్పారు.

అసోం ఒప్పందంలో ఎన్‌ఆర్‌సి ఒక భాగమే కాకుండా, మళ్లీ అధికారం లోకి రావాలన్న లక్షంతో బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా దీన్ని చేర్చడమైందని మంత్రి వివరించారు. అసోంలో ఎన్‌ఆర్‌సి గడువు పొడిగించాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని, లోపాలను సవరించాలని కోరుతూ దాదాపు 25 లక్షల మంది సంతకాలతో కేంద్రానికి, రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారని హోం మంత్రిత్వశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.

జాబితా నుంచి అసలు సిసలైన పేర్లు గల్లంతై వాటికి బదులుగా చాలా బోగస్ పేర్లు నమోదయ్యాయని, అందువల్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టును ప్రభుత్వం కోరిందని వెల్లడించారు. కొంతవరకు ఆలస్యం అయినా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్‌ఆర్‌సి అమలు చేయడమవుతుందని మంత్రి చెప్పారు. అసలు వాస్తవ పౌరుడు జాబితా నుంచి గల్లంతు కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. రోహింగ్యా ముస్లింల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తమ వద్ద ఖచ్చితమైన  సమాచారం లేదని, వారంతా దేశంలో విస్తరించి ఉన్నారని, వారిలో కొందరు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి పోయారని, త్వరలో వారి వివరాలు సేకరిస్తామని రాయ్ చెప్పారు. దేశంలో విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఉందేవారిని నిరోధించడానికి విదేశీయుల ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.